వైద్య విద్యా కోర్సులు చదవాలని ఆకాంక్షించే గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం కలిగించే నీట్ రద్దు చేయాల్సిందేనని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డీఎంకే ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. స్థానిక తిరువాన్మియూరులోని రామచంద్రా కన్వెన్షన్ కల్యాణమండపంలో బుధవారం ఉదయం రెండో విడతగా 19 జిల్లాలకు చెందిన 107 శాసనసభ నియోజకవర్గాల్లోని పదో తరగతి, ప్లస్-2 పరీక్షలలో ఉత్తీర్ణులైన 640 మంది విద్యార్థులకు నగదు కానుకలు, విద్యా ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.