ఏపీలో వర్షాలు కురుస్తాంయటోంది వాతావరణశాఖ. నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి.. వేడి వాతావరణంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అంటున్నారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది అంటున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్న, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. తిరుపతి జిల్లాలో ఈరోజు రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలులు వీస్తాయని.. దయచేసి అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. జులై 7న సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జులై 8న కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురస్తాయంటున్నారు. కొన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలులతోకూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వానలకు అవకాశం ఉందంటున్నారు.