దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన హస్తం పార్టీ.. ఆమె నాయకత్వంలో తొలిసారి జరగబోతున్న వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఓ సందేశం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్న సోనియా గాంధీ.. ఆయన నిస్వార్థంతో, అకింత భావంతో దేశానికి, రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని కొనియాడారు. వైఎస్ 75వ జయంతి సందర్భంగా ఆయన చేసిన ప్రజా సేవకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె అయిన షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారన్న సోనియా..ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు సేవ చేయడం కోసం బలపడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సోనియా.. ఓ మనిషిగా, కాంగ్రెస్ పార్టీలో విలువైన సహోద్యోగిగా ఆయన పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాల్సిన ఆయన జీవితం అనూహ్యంగా ముగిసిపోయిందన్నారు. వైఎస్ మరణానికి తాము ప్రతి రోజూ సంతాపం తెలుపుతామన్న సోనియా.. ఆయన చూపిన మార్గంలో నడుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆయన స్మృతిని గౌరవిస్తుందన్నారు.
సోనియాకు షర్మిల ధన్యవాదాలు..
సోనియా గాంధీ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన షర్మిల.. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘రేపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భంగా, ఆయనను తలుచుకుంటూ, ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పార్టీకి అయన అందించిన అద్వితీయమైన సేవలను గుర్తు చేసుకున్న శ్రీమతి సోనియా గాంధీగారికి అపురూపమైన ధన్యవాదాలు. ఈ సందర్భంగా, నాపై మీరు ఉంచిన నమ్మకం, నాకు నా మహత్తర బాధ్యత ఎల్లప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని, అయన ప్రేమించిన, జీవించిన కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్తగా ప్రజలకోసం నిలుస్తూ, అటు రాహుల్ గాంధీగారి ఆశయసాధనకు పోరాడుతూనే ఉంటాను’’ అని సోనియాకు బదులిచ్చారు.