మాజీ సీఎం వైయస్ జగన్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమన్నూతలకు చెందిన నరేంద్ర అనే యువకుడు మద్యం మత్తులో నీటిలో పడి ప్రాణాపాయ స్థితిలోకి జారుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న సన్నిహితులు 108 వాహనానికి ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై పులివెందులలోని ఆసుపత్రికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మండలం పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి వస్తూ మార్గమధ్యంలో చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడేందుకు ఆగారు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రాణపాయ స్దితిలో ఉన్న యువకుడు నరేంద్రను తన సన్నిహితులు తీసుకువచ్చి తాము 108 కు ఫోన్ చేస్తున్నా రాలేదని, కనీసం కాన్వాయ్ లో ఉన్న 108 వాహానంలో నైనా తన స్నేహితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. దీంతో సమాచారాన్ని వైఎస్ జగన్ కు చేరవేయగా ... అయన వెంటనే తన కాన్వాయ్‌లో ఉన్న 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని సూచించారు. దీంతో నరేంద్రను హుటాహుటిన 108 లో ఆక్సిజన్ సహాయంతో పులివెందుల మెడికల్ కళాశాలకు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం నరేంద్ర పులివెందుల మెడికల్ కళాశాలలో కోలుకుంటున్నాడు. ఇప్పటికే అనేకసార్లు 108కు ట్రాఫిక్ క్లియర్ చేసి దారి ఇస్తూ అనేక మార్లు ప్రాణాలు కాపాడిన వైఎస్ జగన్ మరో మారు కూడా తన దాతృత్వాన్ని చాటుకుని ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.