సవరవల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారికి సంబంధించిన అండర్‌పాస్ రోడ్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. జాతీయ రహదారి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, స్థానికులు ఇటీవల ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఎంపీతో పాటు ఎమ్మెల్యే నాగమాధవి ఆదివారం సవరవల్లిలో జాతీయ రహదారిని పరిశీలించారు. వారితో పాటు ఉన్న బంగార్రాజు మాట్లాడుతూ జాతీయ రహదారికి ఇరువైపుల అనేక గ్రామాలు ఉన్నాయి.. వాహనాల రాకపోకలకు, బాటసారులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.. ఈమేరకు అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ రహదారి కారణంగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవలె జాతీయ రహదారి విస్తరణ అధికారులతో మాట్లాడమని, రహదారి సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పారు. జాతీయ రహదారిలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించి, ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, దాట్ల సూర్యనారాయణమూర్తిరాజు, బొల్లు త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.