వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్సీపీ నేతలు పోతిన వెంకటమహేష్, తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. అనంతరం వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ సంకెళ్లలోఉందని విమర్శించారు. నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయం సమీపంలోనే దారుణం జరిగిందన్నారు. దాడులను అరికట్టాలని ఇటీవల సీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని, సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగాయన్నారు. బొండా ఉమా మర్యాదగా ఈ దాడులు ఆపాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఈ దాడులను అరికట్టకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.