నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. 2004లో తన పవర్ పోయింది కానీ పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు.