కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు వచ్చిన అత్యవసర రోగికి ఇంత వరకు చికిత్స అందించలేదు.. ఇలా వైద్యం చేస్తే ఎలా..? అంటూ క్యాజువాల్టీ వైద్యులపై నంద్యాల ఎంపీ బైౖరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 45ఏళ్ల రమణయ్య సోమవారం మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని జీవన్‌జ్యోతి స్కూల్ వద్ద ద్విచక్ర వాహనం నుంచి కింద పడి గాయపడ్డారు. అతన్ని హుటాహుటిన బంధువులు మధ్యాహ్నం 3.45 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే రోగిని వైద్యులు అసలు పట్టించుకోవడం లేదని బంధువులు నంద్యాల ఎంపీకి ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి సాయంత్రం హాస్పిటల్‌కు చేరుకుని క్యాజువాల్టీలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించారు. రోగికి సెలైన్ పెట్టి చేతులు దులుపుకుంటారా.. మూడు గంటలైనా ఇంత వరకు ఎందుకు వ్యాధి నిర్ధ్దారణ పరీక్షలు చేయలేదని క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్‌పై మండిపడ్డారు.