ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జులై 16న సమావేశం కానుంది. జులై 16వ తేదీ సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు అమోదంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. జులై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జులై 16న ఏపీ మంత్రివర్గం భేటీ కానుండటంతో.. ఈ సారి ఏం నిర్ణయాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే.. హామీల అమలుపై దృష్టిపెట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పేదవారికి ఉపయోగపడేలా సామాజిక భద్రత పింఛన్ల పెంపును ఏప్రిల్ నెల నుంచే అమలు చేశారు. పెంచిన పింఛన్ మొత్తాన్ని, అలాగే మూడు నెలల బకాయిని కలిపి ఇంటివద్దకే అందించారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం మరికొన్ని హామీల అమలు దిశగా అడుగులు వేయచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెలరోజుల్లోపు అమలు చేస్తామంటూ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం జరిపి.. ఆ తర్వాత ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో జులై 16న జరిగే మంత్రివర్గ భేటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైనా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం కోసం కమిటీలను ఏర్పాటుచేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే మంత్రివర్గంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది.