ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను 2026 నాటికల్లా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి... కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. విమానాశ్రయ టెర్మినల్, రన్ వే, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా టెర్మినల్ భవనం పూర్తి చేస్తామన్నారు. అలాగే 2026 నాటికి ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.ఉత్తరాంధ్రకు విమానాశ్రయం అనుసంధానం కావాలంటే భోగాపురం విమానాశ్రయం కీలకమన్న కేంద్ర మంత్రి.. వేగంగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులలో ఆలస్యమైందన్న రామ్మోహన్ నాయుడు.. ఎయిర్ పోర్టు ప్లాన్‌లో(2700 ఎకరాలు ఉంటే.. 500 ఎకరాలు తగ్గించేందుకు గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోగాపురం విమానాశ్రయం నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పనులకు కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్న రామ్మోహన్ నాయుడు.. ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు భోగాపురం విమానాశ్రయం పూర్తి అయితే ఆరు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోయిందన్న ఆయన.. తాము మాత్రం మొదటి నెలలోనే ప్రాజెక్టును సందర్శించి ఎప్పటిలోగా పూర్తిచేస్తామో చెప్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రిగా భోగాపురం ఎయిర్ పోర్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని.. చెప్పిన గడువులోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.