ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖవాసులకు అలర్ట్.. అతడి ఆచూకీ చెబితే రూ.50వేలు ఇస్తారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 10:34 PM

అనకాపల్లి జిల్లాలో సంచలనంరేపిన బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకు చెందిన బాలికను చంపిన కేసులో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన బోడాబత్తుల సురేష్‌ ఈ నెల 6న హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులు సోమవారం నిందితుడి వివరాలతో పోస్టర్‌ను విడుదల చేశారు. సురేష్ ఆచూకీ తెలిస్తే 94407 96084, 94407 96108, 94409 04229, 73826 25531 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపినవారి వివరలను గోప్యంగా ఉంచుతామంటున్నారు పోలీసులు. సురేష్ పారిపోయిన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.


అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంరేపింది. కొప్పుగొండుపాలెంలో జులై 6న సాయంత్రం బాలిక ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోగా.. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక హత్య కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్‌గా స్పందించారు. అతడి కోసం 20కి పైగా ప్రత్యేక బృందాలతో బస్‌ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీగా ఉండే ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అతడి ఆచూకీ దొరకలేదు.. సురేష్ ఫోన్‌ వాడకపోవడంతో పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టడం కాస్త సవాల్‌గా మారిందనే చెప్పాలి. సురేష్ స్నేహితులు సహా కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు అతడి గురించి ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, విశాఖపట్నం జైలులో సురేష్‌‌తో ఉన్న పరిచయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com