ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె సాయిసూర్య అవినాశ్ (24) అమెరికాలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. చిట్యాల గ్రామానికి చెందిన గద్దె శ్రీనివాసరావు, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె వాసవ్యకు వివాహమైంది. కుమారుడు అవినాశ్ తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తిచేసి.. గతేడాది జనవరిలో అమెరికాకు వెళ్లి అక్కడి ట్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఈ నెల 7న న్యూయార్క్‌లోని అల్బానీలో ఉన్న బార్బర్‌విల్లే జలపాతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో అవినాశ్ జలపాతంలో పడిపోయి మృతిచెందాడని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఈ వార్త తల్లిదండ్రులకు సోమవారం తెలియడంతో వారు హతాశులైపోయారన్నారు. చిట్యాలలో విషాదఛాయలు అలముకున్నాయి.