ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటుపై మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీలోని మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుందని.. దీనికి కేంద్రం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందంటూ గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో.. బుధవారం బీపీసీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటుపై చర్చించారు.ఇక బీపీసీఎల్ ప్రతినిధులతో భేటీపై చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశానికి తూర్పు తీర ప్రాంతంలో ఉండటం మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అపారమైన పెట్రో కెమికల్ నిల్వలు ఉన్నాయని అన్నారు. బుధవారం బీపీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సమావేశమయ్యానన్న చంద్రబాబు..60 వేల కోట్ల నుంచి 70,000 కోట్ల పెట్టుబడితో ఏపీలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుపై చర్చించినట్లు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని కోరినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందన్న చంద్రబాబు.. దీనిపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు.
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు బీపీసీఎల్ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుక కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి కూడా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే బీపీసీఎల్ ఛైర్మన్, ఇతర ప్రతినిధులు అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది . బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అటు ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా పోటీపడ్డాయి. అయితే హస్తిన పర్యటనలో బీపీసీఎల్ రిఫైనరీని ఏపీలోనే ఏర్పాటు చేసేలా చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించినట్లు తెలిసింది. వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయాలని కోరినట్లు సమాచారం. దీంతోనే సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది.
దేశంలో పెట్రోకెమికల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కొత్త రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ గత కొంతకాలంగా భావిస్తోంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని మచిలీపట్నంలో కొత్త రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రిఫైనరీ ఏర్పాటు కోసం రెండు నుంచి మూడు వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. అయితే ఈ ఇంత మొత్తం భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ రిఫైనరీ ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, బీపీసీఎల్ ప్రతినిధుల మధ్య సంప్రదింపులు మొదలైన నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.