నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.ఈ పాపం ఎవ్వరిదీ.. ఈ ఘోరానికి కారణమెవరనే దానిపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ముక్కుపచ్చలారని ఓ ఎనిమిదేళ్ల బాలిక.. ఈ ఘోరంలో బలిపశువుగా మారింది.తప్పు చేసినట్లుగా పైకి కనిపిస్తోంది ముగ్గురు బాలురు అయినప్పటికీ.. వారంత కర్కశంగా, రాక్షసంగా ప్రవర్తించడానికి కారణమేంటనే దానిపై ఆలోచిస్తే వేళ్లన్నీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పెడ పోకడలవైపే చూపిస్తాయి. అసలు వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజులుగా కనిపించడం లేదు. బాలిక కనిపించకపోవటంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు.. స్థానికంగా ఉన్న నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న నందికొట్కూరు పోలీసులు.. బాలిక ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించారు. జాగిలాల సాయంతోనూ బాలిక జాడను కనుగొనే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నంలో దారుణ విషయాలు వెలుగుచూశాయి. ఆ బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి.. కాల్వలోకి తోసేసిన దారుణ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటున్న సమయంలో.. పక్కకు తీసుకెళ్లినట్లు మైనర్ బాలురు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. అనంతరం బయటకు తెలుస్తుందనే భయంతో బాలికను కాలువలోకి తోసేసినట్లు ముగ్గురు నిందితులు పోలీసులకు చెప్పారు. దీంతో బాలిక ఆచూకీ కోసం కాల్వలో పోలీసులు గాలిస్తున్నారు.
అయితే ముగ్గురు మైనర్లు ఇంత అమానుషంగా వ్యవహరించడానికి కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. రోజురోజుకూ సమాజంలో జరుగుతున్న ఘటనలు, పెడ పోకడలు యువతను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయనే దానికీ, నేరప్రవృత్తి ఎలా పెరుగుతోందనడానికి ఈ ఘటనను ఉదాహరణగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. యువత పక్కదారి పట్టకుండా వారి తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలని.. వారిని ఓ కంట గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.