విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఆరు స్థానాలకు.. ఏడుగురు బరిలోకి దిగారు. ఈ స్టాండింగ్ కమిటీ పదవులకు.. వైఎస్సార్‌సీపీ తరఫున.. రెండో డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి, మూడో డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, 33వ డివిజన్ కార్పొరేటర్ వల్లూరి ఎన్‌డీఎస్ మూర్తి, 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపటి కోటిరెడ్డి, 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి పోటీలో నిలిచారు. తెలుగు దేశం పార్టీ నుచి 32వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్‌రావు పోటీ చేశఆరు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 64 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వీరిలో 11వ డివిజన్ కార్పొరేటర్ రాజీనామాకు ఆమోదం తెలపడంతో.. 63 మంది కార్పొరేటర్లు మిగిలారు. వీరిలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ, మరో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఓటింగ్‌కు రాలేదు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన బాలగోవిందు అనారోగ్యంతో బాధపడుతుండగా.. సీపీఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు స్టాండింగ్ కమిటీ ఎన్నికలను బహిష్కరించారు. ఇక మిగిలిన 59 మంది కార్పొరేటర్లు ఓటింగ్ కోసం వచ్చారు.
వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసినవారిలో.. ప్రవల్లికకు 47, నిర్మల కుమారికి 47, కోటిరెడ్డికి 46, వీఎన్‌డీఎస్ మూర్తికి 45, ఇర్ఫాన్‌కు 45, దేవికి 44 ఓట్లు వచ్చాయి. ఈ ఆరుగురు స్టాండింగ్ కమిటీకి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.. అంటే ఆరు స్థానాలను వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసిన రామ్మోహనరావుకు కేవలం 16 ఓట్లు వచ్చాయి. అయితే వైఎస్సార్‌సీపీకి మొత్తం 49 మంది కార్పొరేటర్లు ఉంటే.. మొత్తం ఓట్లు వైఎస్సార్‌సీపీకి పూర్తిస్థాయిలో పోల్ కాలేదు. అయితే గతంలో టీడీపీలో గెలిచిన మాధురీలావణ్య పార్టీ మారారు.. అయినా టీడీపీ 12మందితో పాటు అదనంగా నాలుగు ఓట్లు వచ్చాయి. నలుగురు కార్పొరేటర్ల మద్దతు తెలుగు దేశం పార్టీకి ఉందని తెలుస్తోంది.
అంతకముందు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటింగ్ తర్వాత కార్పొరేటర్లు వీఎంసీ ప్రాంగణంలోనే నిలబడి మాట్లాడుకుంటుంగా.. పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కార్పొరేటర్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎంసీలో పెత్తనం ఏంటని మండిపడ్డారు. పాలకవర్గంగా ఉన్న పార్టీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీకి ఎన్నిక కావడం సాధారణంగా జరుగుతుంటుంది.. ఈ ప్రక్రియ ఏకగ్రీవంగా జరుగుతుంది. వీఎంసీ ఏర్పాటైన తర్వాత స్టాండింగ్ కమిటీలోని పదవులకు గతంలో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఇప్పుడు తొలిసారిగా ఈ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు.