ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న శేషాచల కొండపై కల్తీ జ్యూస్ తయారీ కలకలంరేపింది. కొండపై ఉన్న ఓ షాపులో కాలం చెల్లిన పాలతో జ్యూస్ తయారు చేయడంపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన దేవస్థానం అధికారులు షాపులో తనిఖీలు చేసి భారీగా కాలం చెల్లిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ భక్తుడు చిన వెంకన్న దర్శనం కోసం ద్వారకా తిరుమల వచ్చారు. కొండపై ఉన్న జ్యూస్ స్టాల్‌ో ఓ జ్యూస్ ఆర్డర్ చేశారు. జ్యూస్ స్టాల్ నిర్వాహకుడు తన దగ్గర ఉన్న పాల ప్యాకెట్లతో జ్యూస్ తయారుచేసి భక్తుడికి ఇచ్చాడు. అయితే భక్తుడు జ్యూస్ తయారు చేసిన ఆ పాల ప్యాకెట్‌ను పరిశీలిస్తే.. కాలం చెల్లినట్లు గుర్తించారు. ఆ భక్తుడు వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. జ్యూస్ స్టాల్లో తనిఖీలు చేశారు. ఆలయ అధికారుల తనిఖీలలో భారీగా కాలం చెల్లిన పాల ప్యాకెట్లను గుర్తించారు. మొత్తం 217 పాల ప్యాకెట్లు డేట్ పూర్తైనట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుని.. షాప్‌ను సీజ్ చేశారు.
ద్వారకా తిరుమలలో ట్రాఫిక్ కష్టాలు
మరోవైపు ద్వారకా తిరుమలలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన వెంకన్న దర్శనం కోసం నిత్యం ద్వారకా తిరుమల క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.. దీంతో రద్దీ పెరుగుతోంది. దీనికి తోడు పలువురు ఫాస్ట్ ఫుడ్ షాపులు, టిఫిన్ షాపులు రోడ్డు పక్కన నిర్వహిస్తున్నారు. భక్తులు తమ వాహనాలను షాపుల దగ్గర రోడ్లపై ఉంచుతున్నారు. ద్వారకా తిరుమలలోని గుడి సెంటర్, పసరు కోనేరు దగ్గర నుంచి బస్టాండ్ వద్దకు వెళ్లే రోడ్డు, అంబేద్కర్ విగ్రహం నుంచి భీమడోలు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
ద్వారకా తిరుమల వచ్చిన భక్తులు తమ వాహనాలను లింగయ్య చెరువు దగ్గర నుంచి కొండపైకి వెళ్లే మార్గంలో రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తుండటంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొండపైన అన్నదాన భవనం దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొండపైన సెంట్రల్ పార్కింగ్ ఏర్పాటు చేసినా సరే రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. ద్వారకా తిరుమలలో ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ద్వారకా తిరుమల రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.