స్టీల్‌ప్లాంటు ప్రగతికి అన్నివిధాలా అండగా ఉంటామని, అందుకోసం కేంద్ర పెద్దలతో మాట్లాడతామని ఎంపీ ఎం.శ్రీభరత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన స్టీల్‌ప్లాంటు ప్రస్తుత పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులతో కలిసి కర్మాగారంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్లాంటులో ప్రస్తుత పరిస్థితులను సీఎండీ అతుల్‌భట్, డైరెక్టర్‌లు, ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సెయిల్‌లో విలీనం చేస్తే ప్లాంటు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని గనుల లీజును పునరుద్ధరించాలని, విద్యుత్ బిల్లులు చెల్లింపులో కొంత వెసులుబాటు ఇవ్వాలని, కేంద్ర సహకారం కావాలని ఉన్నతాధికారులు కోరగా...రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఏం కావాలన్న చేస్తామని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం స్టీల్‌ప్లాంటులో పర్యటించనున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి దృష్టికి తీసుకువెళ్లాల్సిన ప్రధాన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రైవేటీకరణ ఉపసంహరణ, ప్లాంటుకు ఆర్థిక సహాయం, ప్రోత్సాహం, భవిష్యత్తులో మరింత ప్రగతి కోసం చేపట్టాల్సిన చర్యలు, ఉద్యోగుల ప్రధాన సమస్యలు వంటి అంశాలపై చర్చించారు.