ఉమ్మడి పశ్చిమలో ఇప్పటికే ర్యాంపులన్నీ మూతపడ్డాయి. ఒక వైపు గోదావరికి వరద వచ్చే సూచనలు ఉండటం, ఎగువన వర్షాలు కురవడంతో గోదావరిలో నీటి ఉధృతి పెరగడం, బాటలు లేకపోవడం, పడవలు ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చే ర్యాంప్‌లలో సైతం తవ్వకాలకు ఇంకా అనుమతి లభించకపోవడం తదితర కారణాలతో ర్యాంప్‌లలో పూర్తి స్థాయిలో ఇసుక సేకరణ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం పక్క జిల్లాల నుంచి ఉచిత ఇసుకు తీసుకు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఇక్కడి నుంచి అక్కడకు వెళితే అక్కడ నిబంధనలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక ఉచిత పాలసీ అమలులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో టన్ను రూ.270 చొప్పున అమ్ముతున్నారు. 20 టన్నులు కొనుగోలుకు రూ. 5,400 చెల్లించాల్సి ఉండగా దూరాన్ని బట్టి లారీ కిరాయితో కలుపుకుని రూ.10 నుంచి 11 వేలు మధ్యలో నాలుగున్నర యూనిట్లు ఇసుక లభిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో అమ్మకాలతో పోలిస్తే వీటి ధర తక్కువే అయినప్పటికీ విశాఖపట్టణం, నర్శీపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే గతంలో టన్ను ఇసుక రూ. 950లకే నేరుగా వినియోగదారుని ఇంటికే చేరేది. ఇపుడు స్టాక్ పాయింట్లలోనూ టన్నుకు రూ.1395 రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. దీనికి కిరాయి అదనం. అంటే సుమారు గత ధర కంటే ఇపుడు రెట్టింపు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే పలువురు ప్రజా ప్రతినిధులు ఇసుకను బొక్కేశారు. రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో పర్వతాల మాదిరి ఉన్న ఇసుక గుట్టలు రెండు రోజుల్లో ఖాళీ అయ్యాయి. రెండు జిల్లాల్లోనూ వారం రోజులపాటు ఇసుక దందా జరిగింది. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో నిల్వ చేసిన ఇసుకలో మూడు వంతులు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.