అధికారం, హోదాను అడ్డుపెట్టుకుని.. మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆగడాలు ప్రస్తుతం బయటికి వస్తున్నాయి. పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా ఐఏఎస్‌గా పని చేసి రిటైర్ కాగా.. ఆయన కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారి ఆస్తులు రూ.40 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక పూజా ఖేద్కర్ తల్లి గతంలో చేసిన గూండాగిరీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గన్ పట్టుకుని.. అమాయక రైతులను బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పూజా ఖేద్కర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పూజా ఖేద్కర్‌పై వస్తున్న ఆరోపణలు నిజం అని తేలితే ఆమెను సర్వీసు నుంచి తొలగించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
పూజా ఖేద్కర్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన దిలీప్ ఖేద్కర్.. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో దిలీప్ ఖేద్కర్ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే పక్కనే ఉన్న రైతుల భూములను కూడా దిలీప్ ఖేద్కర్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. స్థానిక రైతులు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పొలం విషయంలో అక్కడ పెద్ద గొడవ కాగా.. స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన పూజా ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్.. తన సెక్యూరిటీ గార్డులతో అక్కడికి చేరుకుని స్థానిక రైతులను బెదిరించారు. చేతిలో తుపాకీ పట్టుకుని రైతులను బెదిరించినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ రైతుకు తుపాకీ చూపించిన మనోరమా ఖేద్కర్.. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు అని బెదిరించింది. దానికి బదులిచ్చిన ఆ వ్యక్తి తన పేరుపైనే భూమి రిజిస్ట్రేషన్ అయిందని.. కానీ ఆ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. దానికి తీవ్రంగా ఫైర్ అయిన మనోరమా ఖేద్కర్.. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో.. నాకే రూల్స్ చెప్పకు అని వార్నింగ్ ఇవ్వడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.
ఇక పూజా ఖేద్కర్‌కు చెందిన ఆడీ కారుపై 21 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు వెల్లడైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆమెకు రూ.27 వేల జరిమానా కూడా విధించారు. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పూజా ఖేద్కర్.. అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన ప్రైవేట్ ఆడీ కారుకు.. రెడ్ కలర్ బీకన్ లైట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసుకోవడమే కాకుండా తనకు ఐఏఎస్‌లకు ఉండే అన్న సౌకర్యాలు కల్పించాలని కిందిస్థాయి ఉద్యోగులకు హెచ్చరిస్తూ చేసిన వాట్సాప్ చాటింగ్‌లు బయటికి వచ్చాయి. అంతేకాకుండా అడిషనల్ కలెక్టర్ లేని సమయంలో ఆయన ఛాంబర్ వాడుకోవడమే కాకుండా అందులోని ఫర్నీచర్ తొలగించి తన నేమ్ బోర్డు పెట్టుకోవడంతో పూజా ఖేద్కర్ వివాదం బయటికి వచ్చింది.
మరోవైపు.. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్.. యూపీఎస్సీ పరీక్షలో 841 ర్యాంక్ సాధించింది. అయితే ఆమె నకిలీ సర్టిఫికేట్లు సమర్పించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కంటి సమస్యలతోపాటు మానసిక వైకల్యం ఉందని.. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాను దుర్వినియోగం చేసి ఐఏఎస్ సర్వీస్ సాధించినట్టు పూజా ఖేద్కర్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసి ప్రస్తుతం విచారణ చేపట్టింది. ఇక ఈ వివాదం బయటికి వచ్చిన తర్వాత పూణే నుంచి వాసిం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీ వేటు పడగా.. తాజాగా ఆమె బాధ్యతలు చేపట్టారు.