కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీపై.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ కార్యకర్తల వరకు అంతా నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీకి, గాంధీల కుటుంబానికి ఎప్పటినుంచో కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని 2019 లో ఓడించి స్మృతి ఇరానీ చరిత్ర సృష్టించారు. అప్పటినుంచి రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ ప్రతీ విషయంలోనూ కౌంటర్లు వేస్తూనే వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై స్మృతి ఇరానీ.. అమేథీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్మృతి ఇరానీపై తీవ్రంగా విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ విషయం కాస్తా.. రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. అయితే ఇలా ఓడిపోయిన వారిని కించపరచడం, అవమానించడం సరైంది కాదని హితవు పలికారు. ఇలా ఓడిన వారిని విమర్శించడం.. బలహీనత అవుతుంది తప్ప.. బలం అని అనిపించుకోదని నెటిజన్లకు సూచించారు. స్మృతి ఇరానీ, లేదా ఇతర నాయకులను అవమానించడం.. దుర్భాషలాడడం వంటివి చేయవద్దని కోరుతున్నా అంటూ రాహుల్ గాంధీ తన ట్విటర్ అకౌంట్‌లో ఒక ట్వీట్ చేశారు.
ఇక ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై గెలిచినపుడు స్మృతి ఇరానీ ఎన్నో మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు స్మృతి ఇరానీ ఓడిపోయినపుడు రాహుల్ గాంధీ ఆమెలా వ్యవహరించడం లేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. గెలిచినపుడు విర్రవీగిపోకుండా.. ఎంతో సంయమనంతో, పెద్ద మనసుతో స్పందించడం గొప్ప విషయం అని కామెంట్లు పెడుతున్నారు.
అమేథీలో 2019 లో గెలిచినప్పటి నుంచి రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక 2024 ఎన్నికల్లో దమ్ముంటే తనపై మరోసారి అమేథీలో పోటీ చేసి గెలవాలని స్మృతి ఇరానీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలేసి రాయ్‌బరేలీ నియోజకవర్గానికి పరిమితం అవుతానని ప్రకటించారు.