తన మతిమరుపుతో విమర్శలను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పప్పులో కాలేశారు. నాటో సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీను వ్లాదిమిర్ పుతిన్ అంటూ పరిచయం చేశాడు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించే మీడియా సమావేశానికి కొద్ది గంటల ముందే ఈ పొరపాటు జరగడం గమనార్హం. అయితే, తన తప్పును గ్రహించిన బైడెన్.. వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. పుతిన్ కంటే జెలెన్‌స్కీ మంచి వ్యక్తి అంటూ కవర్ చేసినా.. బైడెన్ మతిమరుపు గురించి ఆందోళనలను తీవ్రతరం చేసింది.
వాష్టింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, ధైర్యవంతుడు అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మీకు పరిచయం చేస్తున్నాను’’ అని ప్రకటించడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు. తన తప్పును వెంటనే తెలుసుకున్న ఆయన.. ‘అధ్యక్షుడు పుతిన్! అతను ప్రెసిడెంట్ పుతిన్‌ను ఓడించబోతున్నాడు ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ.. నేను పుతిన్‌ను ఓడించడంపై దృష్టి సారిస్తున్నాను.. దాని గురించి మనం ఆందోళన చెందాలి’ అని సవరించే ప్రయత్నం చేశారు.
కాగా, దీనిపై నాటో సభ్యదేశాల నాయకులను ప్రశ్నించగా.. ‘ఒక్కోసారి నోరు జారుతుంది.. ప్రతి ఒక్కటీ గమనిస్తే ఇలాగే ఉంటుంది’ అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. బైడైన్ చాలా ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని మంత్రి కైర్ స్టార్మర్ మంచి ఫామ్‌లో ఉన్నాడని అన్నారు.
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మరోసారి సిద్ధమవుతోన్న బైడెన్‌కు సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమొక్రాట్లలో అసమ్మతి సెగలు గక్కుతోంది. రోజు రోజుకూ పార్టీలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు పెరుగుతున్నారు. తాజాగా, హాలీవుడ్ నటుడు, పార్టీ మద్దతుదారుడైన జార్జీ క్లూనీ జతకలిశారు. బైడెన్ అభ్యర్ధిత్వం నుంచి తప్పుకోవడం మంచిదని, లేకుంటే డొనాల్డ్ ట్రంప్ గెలుపును ఆపడం కష్టమని వ్యాఖ్యానించారు. మొత్తం 14 మంది డెమొక్రాటిక్ రిప్రంజటేటివ్స్‌లు సైతం బైడెన్ వైదొలగాలని డిమాండ్ చేశారు.
గురువారం వెలువడిన ఓ సర్వేలోనూ సగం మంది డెమొక్రాట్లు, మూడింట రెండొంతుల మంది అమెరికన్లు బైడెన్ తప్పుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, అయితే వాషింగ్టన్ పోస్ట్-ABC న్యూస్-ఇప్సోస్ సర్వే ప్రకారం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 46 శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ట్రంప్‌ను ఢీకొట్టే సత్తా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కే ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బైడెన్ టీం గుంభనంగా ఉంది.