మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలి పట్ల సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత కొన్ని రోజుల నుంచి బైడెన్ అనుసరిస్తున్న తీరు.. అధ్యక్ష పోటీలో ప్రత్యర్థి ముందు తడబడటం డెమోక్రటిక్ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనను తప్పుకోవాలని సొంత పార్టీ నుంచే తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బైడెన్‌ను పక్కకు తప్పుకోవాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన డాక్టర్లు సూచిస్తే తాను మెడికల్ టెస్ట్‌లు చేయించుకునేందుకు సిద్ధం అంటూ ప్రకటించారు.
తన డాక్టర్లు సూచిస్తే వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకునేందుకు తాను సిద్ధమని జో బైడెన్ ప్రకటించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా తన మానసిక స్థితిపై తీవ్ర సందేహాలు నెలకొన్న వేళ.. ఆయన చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని.. దాన్ని నిరూపించుకునేందుకు అవసరమైతే ఎలాంటి మెడికల్ టెస్ట్‌లకైనా తాను సిద్ధమే అంటూ తాజాగా నాటో సదస్సు అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ ప్రకటించారు. బైడెన్ మానసిక స్థితిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్న వేళ బైడెన్ ప్రకటన రావడం గమనార్హం.
తన డాక్టర్లు మరోసారి న్యూరోలాజికల్ టెస్టులు చేయించుకోవాలని చెబితే తప్పనిసరిగా చేసుకుంటానని బైడెన్ స్పష్టం చేశారు. తన చుట్టూ చాలా పెద్ద పెద్ద, అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారని తెలిపారు. తనకు ఏమైనా సమస్య ఉంటే గుర్తించి చెబుతారని పేర్కొన్నారు. ఇక తాను ఫిట్‌గా ఉన్నట్లు చెప్పిన బైడెన్.. తాను ఏం చేసినా.. ఎవరూ నమ్మడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు 3 సార్లు న్యూరోలాజికల్ టెస్ట్‌లు చేయించుకున్నానని వెల్లడించారు. అందులో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకటి ఉన్నట్లు చెప్పారు.
అయితే బైడెన్ చెప్పినదానికి.. ప్రత్యక్షంగా జరుగుతున్న దానికీ పోలిక లేకపోవడమే ప్రస్తుత గందరగోళానికి దారి తీస్తోంది. ఇటీవల మీడియా ముందు తడబడిన బైడెన్ తాజాగా అదే ప్రవర్తన కనబరిచారు. అమెరికా ఉపాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటూ.. బైడెన్ వింత వింత వ్యాఖ్యలు చేయడం మరోసారి తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.