ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వీడటం లేదు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో ఈడీ, సీబీఐలు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో నిందితులను ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపాయి. అయితే ఈ కేసులో ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేసిన వారు నెలల తరబడి.. జైళ్లలోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో బెయిల్ రాకపోవడంతో వారు ఇంకా జైళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు.. శుక్రవారం ఉదయం.. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందన్న ఆనందం కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతల్లో ఆవిరైంది. ఢిల్లీ మద్యం వ్యవహారానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా శుక్రవారం మధ్యాహ్నం ఆయనకు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 25 వ తేదీ వరకు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మనీలాండరింగ్ కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌కు ఉదయం సుప్రీంకోర్టులో బెయిల్ లభించినా.. తాజాగా సీబీఐ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన మరికొంత కాలం జైలులోనే ఉండనున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని.. అందుకే ఆయన కస్టడీని మరో 2 వారాలు పొడిగించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉండగానే అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆ తర్వాత పలుమార్లు కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మరోవైపు.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అప్పటినుంచి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను ఇదే కేసులో జూన్ 26 వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది.