హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు.. ఆధార్ కార్డులు తీసుకురావాలని ఆమె తాజాగా పెట్టిన ఓ సరికొత్త నిబంధన పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ దగ్గరికి వచ్చే వారు ఆధార్ కార్డులు పట్టుకురావాలని డిమాండ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. కంగనా రనౌత్ పెట్టిన వింత కండీషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఆధార్ కార్డు ఎందుకు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కంగనా రనౌత్.. తనను కలిసేందుకు మండి నియోజకవర్గ ప్రజలు తమ వెంట ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా వారు ఎందుకు తనను కలవాలి అనుకుంటున్నారో ఆ కారణాన్ని కూడా పేపర్‌పై రాసి ఇవ్వాలని.. అలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉత్తరప్రాంతంలో ఉండే ప్రజలు.. తనను కలిసేందుకు మనాలిలోని తన నివాసానికి కూడా రావచ్చని వెల్లడించారు. ఇక తన నియోజకవర్గం మండీ ప్రజలు నగరంలోని తన కార్యాలయానికి వచ్చి.. తనకు సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు.
అయితే కంగనా రనౌత్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు.. ఎంపీ దగ్గరికి వెళ్లి కలుసుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతీ వర్గానికి చెందిన ప్రజల్ని కలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుందని తెలిపారు. ఏ పని అయినా సరే.. ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కంగన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
పని ఉండి ప్రజాప్రతినిధులను కలిసేందుకు వచ్చే ప్రజలను ఇలా గుర్తింపు కార్డులు అడగడం సరైంది కాదని.. కంగనా రనౌత్ వ్యాఖ్యలను విక్రమాదిత్య సింగ్ తప్పుపట్టారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్‌పై.. బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ విజయం సాధించారు. అయితే అంతకుముందే 2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విక్రమాదిత్య సింగ్.. ప్రస్తుతం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.