ఓ వ్యక్తిని పాములు వదలడం లేదు. వరుస కాట్లతో బెంబేలెత్తిస్తున్నాయి. ఉన్నచోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లినా.. ఆ వ్యక్తికి పాము కాట్లు మాత్రం తప్పడం లేదు. ఇప్పటివరకు కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 7 సార్లు కాటు వేసింది. కాటు వేసిన ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లడం.. చికిత్స తీసుకుని తిరిగి ఇంటికి రావడం.. ఆ తర్వాత మళ్లీ పాము కాటు వేయడం ఇలా వరుసగా జరుగుతూనే ఉంది. ఈ ఘటనపై ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 7 సార్లు పాము కాటు వేసిందని.. అయితే 9 సార్లు కాటు వేస్తే అతడు చనిపోతాడని వారు చెప్పడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన వికాస్ దూబే అనే 24 ఏళ్ల యువకుడికి పాము కాట్లు సర్వ సాధారణం అయ్యాయి. 40 రోజుల్లో వికాస్ దూబేను ఏడు సార్లు పాము కాటు వేసింది. దీంతో వికాస్ దూబే తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వికాస్ దూబే పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే మొదట వికాస్ దూబే తన ఇంటి వద్ద ఉన్నపుడు పాము కాటు వేయగా.. తర్వాత తన అత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా అతడిని పాము వెంబడించి మరీ కాటు వేసింది. తాజాగా గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో వికాస్ దూబే పాము కాటుకు గురయ్యాడు.
జూన్ 2 వ తేదీ నుంచి జూలై 6 వ తేదీ మధ్య వికాస్ దూబేను మొత్తం 6 సార్లు పాము కాటు వేసింది. ఆ తర్వాత తాజాగా మరోసారి పాము కాటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదే పదే వికాస్ దూబేను పాము కాటు వేస్తుండటం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడుతున్నారు. అయితే.. వికాస్ దూబే మొత్తం 9 సార్లు పాము కాటుకు గురవుతాడని.. 8 సార్లు పాము కాటు వేసినా బతుకుతాడని.. కానీ 9 వ సారి కాటు వేసిన తర్వాత ఏ డాక్టర్లు గానీ.. తాంత్రికులు గానీ అతడ్ని కాపాడలేరని పేర్కొంటున్నారు.
జూన్ 2 వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీద పడుకుని.. కిందికి దిగుతుండగా వికాస్ దూబేను తొలిసారి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 2 రోజులు చికిత్స పొందిన తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. అయితే.. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు పాము కాటు వేసింది. మళ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. 4 వసారి పాముకాటు వేసిన తర్వాత.. వికాస్ దూబేను వేరే ప్రాంతంలో ఉండమని డాక్టర్ సూచించాడు.
దీంతో రాధానగర్‌లోని తన అత్త ఇంటికి వెళ్లిన వికాస్ దూబే అక్కడ కూడా ఐదోసారి పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు మళ్లీ ఇంటికి తీసుకురాగా.. జూలై 6 వ తేదీన మరోసారి పాము కాటు వేసింది. అయితే.. తనను పాము శనివారం లేదా ఆదివారం రోజున కాటు వేస్తున్నట్లు గుర్తించిన దూబే.. కాటు వేసే ముందు తనకు తెలిసిపోతుందని గతంలోనే చెప్పాడు. ప్రస్తుతం.. వికాస్ దూబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.