కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంటపడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... 40శాతం ఓట్ షేర్ ఉన్న రాజకీయపార్టీగా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని తేల్చి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని.. అది తగదని హెచ్చరించారు. వాగ్ధానాల అమలకు సంబంధించి... రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదన్న చంద్రబాబు మాటలపై స్పందించి ఎన్నికలకు ముందు ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? అని అంబటి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆర్ధిక పరిస్థితి తెలియదు కాబట్టి.. అప్పుడు వాగ్దానాలను ఇచ్చానని, ఇప్పుడు ఏ వాగ్ధానాలను తాను అమలు చేయలేనని చేతులెత్తేయాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏ రకమైన ఆర్ధిక పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు 4వ సారి ముక్యమంత్రి అయ్యేటప్పటికి ఖజానా ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటారా? లేదా ఎగ్గొడతారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయకపోతే అదో పెద్ద చర్చ అని.. కానీ 1989 నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా మేనిఫెస్టోని 98శాతం అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అయితే... ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని అంబటి రాంబాబు మరోసారి పునరుద్ఘాటించారు.