ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య జరుగుతున్న పోరు కాస్తా.. వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల.. టీడీపీకి అనుకూలంగా మారిపోయారంటూ వైసీపీ నేతలు కామెంట్లు, వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు పెడుతున్నాయి. ఇటీవల తల్లికి వందనం పథకం అమలుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సైతం విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే వైసీపీ కౌంటర్లకు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా రియాక్టయ్యారు. వైసీపీ విధానాలను ఎండగడుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
"పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉంది. తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే.. బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. వైసీపీ నేతలకు కళ్లు, చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే... మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి. తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే .. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కనుకే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది" అని షర్మిల ట్వీట్ చేశారు.
" ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది? వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో.. అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు రూ. 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు?" అని షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో తనతో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని… జలయజ్ఞం పూర్తి చేస్తామని ఎందుకు ప్రచారం చేయించారని షర్మిల ప్రశ్నించారు. అలాగే ప్రత్యేక హోదా సాధనపైనా అప్పట్లో తనతో వైసీపీ నేతలు ప్రచారం చేయించారన్న వైఎస్ షర్మిల.. వీటన్నింటిపైనా వైసీపీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎక్స్ వేదికగా సవాల్ చేశారు. మరి వైఎస్ షర్మిల సవాల్ మీద వైసీపీ ఎలా స్పందిస్తునేదీ చూడాలి మరి.