వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో టీడీపీ నేతలు.. సీదిరి అప్పలరాజు మీద శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీదిరి అప్పలరాజు.. అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మానసిక స్థితి మీద సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాశీబుగ్గ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును తిట్టినవారికే మంత్రి పదవులు దక్కాయన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.. ఈ క్రమంలోనే సీదిరి అప్పలరాజు కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మానసిక స్థితి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వైద్య విద్యనభ్యసించిన అప్పలరాజు.. కనీస సంస్కారం, పెద్దలంటే గౌరవం లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజకీయాల్లో విమర్శలే తప్ప వ్యక్తిగత దూషణలు ఉండకూడదన్న గౌతు శిరీష.. ఈ విషయాలను మరిచిపోయి అప్పట్లో వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదును స్వీకరించిన కాశీబుగ్గ పోలీసులు.. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందిన సీదిరి అప్పలరాజు.. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్వింగ్‌లో సీదిరి అప్పలరాజు దారుణంగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష.. సీదిరి అప్పలరాజు మీద ఏకంగా 40 వేల 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే మంత్రిగా వ్యవహరించిన సమయంలో, అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.