ఒంగోలులో ఓ ప్రైవేటు కళాశాలకు సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఇంటర్ విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడికి వైద్యశాలలో చికిత్స చేయించినా పూర్తిగా కోలుకోలేదు. కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి తాగించారని స్నేహితులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ విద్యార్థులు కావడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. వివరాలివీ.. నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన ఉలవపాడుకు చెందిన విద్యార్థి ఒంగోలులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆయన ఈనెల 7వతేదీ బస్సులో ఒంగోలు వచ్చాడు. కళాశాల వద్ద అతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్నేహితులు అతడిని స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వచ్చి కుమారుడిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రెండు రోజులపాటు అక్కడ చికిత్స చేయించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ విద్యార్థి పూర్తిగా కోలుకోలేదు. మగతగానే ఉండటంతో అనుమానం వచ్చి శుక్రవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయినట్లు వారు చెప్తున్నారు. తిరిగి శనివారం రాత్రి మరోసారి వచ్చి ఫిర్యాదు చేశారు. తమ కొడుకుకు మత్తుపదార్థం తాగించారని ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.