ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా బిస్మిల్లాఖాన్ షాదీఖానాలో 123 ఆస్థానాల ముజావర్లకు రూ.5వేల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎంపీ బాలశౌరితో కలిసి ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ తర్వాత మచిలీపట్నంలోనే భారీగా మొహర్రంను పాటిస్తారని మంత్రి అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మసీదులకు మరింతగా నగదు పెంచి ఇస్తామన్నారు. ‘‘ముస్లింలను ప్రభు త్వం ద్వారా అన్నివిధాల ఆదుకుంటాం. రెండు, మూడేళ్లలో మచిలీపట్నంలో ముస్లింల కోసం రూ.1.10 కోట్లతో కమ్యునిటీహాల్‌ను నిర్మిస్తాం. ఈద్గా ప్రహరీ నిర్మాణానికి రూ.25 లక్షలను కేటాయిస్తా.’’ అని ఎంపీ వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి షమీఉన్నీసా, వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, టీడీపీ నేతలు ఇలియాస్‌పాషా, అమీర్ పాల్గొన్నారు.