రాజానగరం నియోజకవర్గం కోరుకొండ,సీతానగరం మండలాలను కలిపే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారికి మునగాల వద్ద ఆదివారం గండిపడింది. దీని కారణంగా 10 గ్రామాల ప్రజానీకం రాకపోకలు నిలిచిపోయాయి. కోరుకొండ, ముగ్గళ్ళ ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణానికి సుమారు మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే రెండేళ్ల కిందటే రోడ్డు పనులు ప్రారంభమైనప్పటికీ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు నేటికి పూర్తి కాలేదు. ఈ రోడ్డుపై కొన్ని కల్వర్టులు, వంతెనలు నిర్మించాల్సి ఉంది. వంతెన నిర్మాణానికి సంబంధించి కాపవరం-మునగాల గ్రామాల మధ్య తోట కాలువ వద్ద కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ పనులకు ఇక్కడ రోడ్డు డైవర్షన్ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు తోట కాలువ మీదుగా వచ్చి గోదావరికి చేరే సందర్భంలో కల్వర్టు నిర్మాణం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గండిపడి కొట్టుకుపోయింది. సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన సుమారు 10 గ్రా మాల ప్రజలకు ఇబ్బంది కలిగింది.ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రయాణీకులను శ్రీరంగపట్నం మీదుగా వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. కోరుకొండ, కాపవరం,మునగాల, కూనవరం, ముగళ్ళ, ఇనిగంటివారిపేట, రఘుదేవపురం, సీతానగరం గ్రామాల ప్రజలు గండిని పూడ్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా గండిని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం పరిశీలించి మునగాల గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.తక్షణం ఆర్‌అండ్‌బీ అధికారులతో గండిపూడ్చే విషయంపై చర్చించారు.