కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చిరుజల్లులు పడుతున్నాయి. తెల్లవారుజామున వర్షం జోరుగా కురుస్తోంది. ఆ తర్వాత నుంచి దఫదఫాలుగా జల్లులు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 17.54 మిల్లీ మీటర్ల సరాసరి వర్షం కురిసింది. ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా 54.4, ఇబ్రహీంపట్నంలో అత్యల్పంగా 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైది. మరోపక్క ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండడంతో వాగుల నుంచి వరద ముందుకొస్తోంది. మెట్ట ప్రాంతంలో ఉన్న కట్టలేరు వాగు నుంచి వరద దిగువకు వస్తోంది. ఈ వరద నీరు కృష్ణా నదిలోకి చేరుతోంది. జిల్లాను ముసురు వాతావరణం కమ్మేసింది. ఈ వర్షాల కారణంగా విజయవాడలో ఎక్కడికక్కడ నీరు నిలచిపోయింది. బెంజ్‌సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కబేళా, లోబ్రిడ్జి, రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్, విద్యాధరపురం, సితార సెంటర్, వాగు సెంటర్ తదితర ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. జాతీయ రహదారిపై ఫుట్‌పాత్‌లకు పక్కన నిలిచిపోయిన నీటిని మున్సిపల్ సిబ్బంది హైడ్రాలిక్ యంత్రం ద్వారా తోడేశారు.