విష జ్వరాలతో మండల కేంద్రం ఎ.కొండూరు మంచం పట్టింది. పారిశుధ్యం సరిలేక గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటి బారినపడి 15 రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 40 ఏళ్ల వయసున్నవారే. దీంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. ఎ.కొండూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సిద్ధం భారతి (32) కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స పొందేవారు. ఒక్కసారిగా జ్వర తీవ్రత పెరడం, కొద్దిగా కామెర్లు లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు చిన్నఅవుటుపల్లిలోని ప్రైవేటు అసుపత్రికి తీసుకేళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త గతంలో క్వారీ పనులు చేస్తుండగా, చేతివేళ్లు తెగిపోయాయి. కుటుంబానికి భారతి సంపదనే ఆధారం. ఆమె మరణంతో కుటుంబం దిక్కులేనిదయింది. ఈనెల 10న ఇదే కాలనీకి చెందిన ఆశా కార్యకర్త తోట రాధ మృతిచెందారు. 10 రోజుల క్రితం పాత కొండూరు హరిజనవాడకు చెందిన వేంపాటి లక్ష ్మణరావు విష జ్వరానికి బలయ్యారు. మృతులు అందరు ఎస్సీ కాలనీకి చెందినవారే. వైద్య సేవలు, పారిశుధ్య చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపొవడంతో, ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటీకి గ్రామాల్లో అనేక మంది జ్వరాలతో బాధపడుతూనే ఉన్నారు. తక్షణం జిల్లా వైద్యాధికారుల బృందం వైద్య శిబిరాలు నిర్వహించాలని, పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.