ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆరు నెలల నెలల పసికందుపై ఓ ఉన్మాది అమానుషంగా ప్రవర్తించాడు. తాత వరసైన వ్యక్తి శిశువుపై పైశాచికానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులకు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఓ తల్లి తన ఆరు నెలల పసికందును కింద పడుకోబెట్టి, ఇంటి బయట పనులు చేసుకుంటోంది. అంతలో ఇంటికి వచ్చిన బాలికకు తాతయ్య వరసైన ఎరకందొర చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. ఒక్కసారిగా ఆ చిన్నారి పెద్దగా ఏడ్చింది. కేకలు విన్న తల్లి పరుగున వచ్చింది. శిశువుకు తీవ్ర రక్తస్రావం కావడం గమనించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఎరకందొర అత్యాచారయత్నం చేశాడని భావించి నిందితుడిపై కర్రతో దాడిచేసింది. అంతలో ఆమె బంధువులు కూడా అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. శిశువు తల్లి శనివారం సాయంత్రం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. చిన్నారిని తొలుత బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, వైద్యుల సూచనతో బాలికను శనివారం రాత్రి విజయనగరం ఘోషాసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుడిని పోలీసులు ఆదివారం ఉదయం స్వగ్రామంలో అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. విజయనగరం ఆసుపత్రిలో ఉన్న చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాలు, వామపక్ష, మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.