ఏపీలో ఇటీవలి కాలంలో చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై స్పందించిన ముఖ్యమంత్రి.. అధికారులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. తనలో ఓపిక, సహనాన్ని పరీక్షిస్తున్నారన్న చంద్రబాబు..ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి పనిచేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలికను మైనర్లు అత్యాచారం చేసి, ఆపై హత్య చేయడం, విజయనగరం జిల్లాలో ఆరునెలల పసిపాపపై వృద్ధుడి లైంగిక దాడి ఘటనలపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి మత్తు కారణంగానే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయన్న సీఎం.. గంజాయి మత్తులో ఉన్మాదులుగా మారి ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. ఇలాంటి కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా విచారణ చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
మరోవైపు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు. బాలిక ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ ఘటనలో దోషులను వదిలేది లేదన్న వంగలపూడి అనిత.. కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. అలాగే విజయనగరంలో అత్యాచారానికి గురైన చిన్నారి పేరుతో ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హోం మంత్రి తెలిపారు. మచ్చుమర్రి ఘటన, విజయనగరం ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.