ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి గురించి చెప్పాలంటే ఏమంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వైసీపీని దారుణంగా దెబ్బతీశాయి. 40 శాతం ఓట్లు సాధించినప్పటికీ.. కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయింది. ఇక ఫలితాల తర్వాత పార్టీ శ్రేణుల్లో ఓ రకమైన నిస్తేజం అలుముకుందనే చెప్పాలి. వీటికి తోడు పార్టీ నాయకుల మీద కేసులు, కార్యకర్తల మీద అక్కడక్కడా జరుగుతున్న దాడులతో వైసీపీ కాస్త ఇబ్బందుల్లో ఉందనే చెప్పొచ్చు. వీటన్నింటి మధ్యనే.. వైఎస్ జగన్ వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే సోషల్ మీడియా ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా దేశ రాజకీయాల్లో జరిగిన తాజా మార్పులు.. వైసీపీకి కాస్త ప్లస్ పాయింట్‌గా మారాయని అనుకోవచ్చు.
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు బీజేపీ నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పూర్తైంది. రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్, మహేష్ జెఠ్మలాని అనే నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 101కి పడిపోయింది. ఇక బీజేపీకి సొంతంగా రాజ్యసభలో 86 మంది సభ్యులు ఉన్నారు. ఇదే సమయంలో విపక్ష ఇండియా కూటమి బలం 87గా ఉంది. రాజ్యసభ మొత్తం సామర్థ్యం 245 కాగా.. ప్రస్తుతం సభలో 225 మంది సభ్యులు ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే 113 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అయితే ఎన్డీఏ కూటమికి 101 మంది మద్దతు మాత్రమే ఉండటంతో.. ఇంకో12 మంది ఎంపీల సహకారం అవసరం అవుతుంది.
దీంతో ఎన్డీఏ, ఇండియా కూటమిలోలేని వైసీపీ, అన్నాడీఎంకే పార్టీలు కీలకంగా మారాయి. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీకి నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు.. రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో కీలకంగా మారనున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో లేకపోయినా కూడా వైసీపీ, అన్నాడీఎంకే ఆ పార్టీకి దూరమేమీ కాదు. దీంతో బీజేపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. ఈ 15 మంది సభ్యుల మద్దతు కూడా ఎన్డీఏ కూటమికి ఉంటుందని విశ్లే్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజ్యసభలో సంఖ్యాబలం కలిగి ఉండటం వైసీపీకి రాజకీయంగా లాభించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఆఖరి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ఈ ఏడాదిలోనే ముగిసింది. దీంతో ఆ పార్టీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2026 నాటికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పరిమల్ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం పూర్తవుతుంది. అప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం దక్కనుంది.