ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసి విజయం సాధించిన జనసేన పార్టీ ప్రజాప్రతినిధులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీయిజాన్ని సహించబోనంటూ పార్టీలోని కొందరు నేతలకు అర్థమయ్యేలా సుస్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
జనసైనికులు, వీర మహిళల కష్టం వల్లే జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలవగలిగారన్న పవన్.. తాను పదవులను ఆశించలేదన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం మనందరికీ పెద్ద బాధ్యత అన్న జనసేనాని.. తానెప్పుడూ అధికారాన్ని చూడలేదని.. కీలకమైన శాఖలు తీసుకోగానే.. వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని అనిపించిందన్నారు.
‘‘నేను ఎందుకు ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నానంటే.. నా మీద చాలా బాధ్యత ఉంది. సంపూర్ణంగా విధివిధానాలు ఏర్పర్చిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి తప్పుకొని ఇంకెవరికైనా అప్పగిస్తాను. కానీ అంతకు ముందు కచ్చితమైన విధివిధానాలు ఏర్పాటు చేస్తాను’’ అని జనసేనాని తెలిపారు.
వైసీపీ వాళ్లెవరూ మనకు శత్రువులు కారన్న పవన్.. వాళ్లు మనకు ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. వైసీపీ వాళ్లను పీడించొద్దన్న జనసేనాని.. వాళ్లు చేసిన తప్పులు మనం చేయొద్దని, కక్ష సాధింపులకు దిగొద్దని హితవు పలికారు. వ్యక్తిగత దూషణకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరిన జనసేనాని.. భావంలో ఉండాల్సిన తీవ్రతను భాషలో చూపించనక్కర్లేదన్నారు. పరుష పదాలు, తీవ్ర పదజాలం వాడాల్సిన అవసరం లేదని పార్టీ నాయకులకు సూచించారు.
పార్టీని పటిష్టం చేయడానికి నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని జనసేన నాయకులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించాలన్న ఆయన.. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఒక రోజు ఉండాలని సూచించారు. దీని వల్ల ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు.
‘‘ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు. అధికారులను ఇబ్బంది పెట్టే పదజాలం వాడకండి. దయచేసి మన కుటుంబ సభ్యులను ప్రభుత్వ కార్యక్రమాలు, రివ్యూల్లో పాల్గొనకుండా చూడండి. వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకం కాదు. కానీ బలవంతంగా జనం మీద రుద్దకూడదు’’ అని పార్టీ నాయకులను పవన్ కోరారు.
‘‘అలాగే కొందరు నాయకులకు చెబుతున్నా.. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. రౌడీయిజాన్ని దయచేసి నమ్మొద్దు. మెత్తగా ఉన్న నాయకులతో దురుసుగా మాట్లాడటం, తిట్టడం చేయొద్దు. వైసీపీ లాంటి గుండా పార్టీని ఎదుర్కొన్న వాణ్ని.. మీరు నన్ను బెదిరించగలరా..? ఆలోచించండి. సోషల్ మీడియాలో మన నాయకుల్ని మీరే తిట్టడం సరికాదు. అలా చేస్తే నాకు మీరెంత నమ్మకస్తులు అయినప్పటికీ.. మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయ చేసి లోతుగా అర్థం చేసుకోండి. నాయకురాళ్లను ఎవరైనా సోషల్ మీడియాలో కించపరిచినా, ఒక మాట అన్నా.. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పవన్ కళ్యాణ్ తమ పార్టీలోని కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
‘‘మనలో భయపెట్టే వాళ్లు, రౌడీయిజం చేసేవాళ్లు, విర్రవీగే వాళ్లకు ఒకే మాట చెబుతున్నా.. నా వెనుక నాలాగే కమిటెడ్‌గా ఏ స్వార్థంలేని జనసైనికులు, వీరమహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్లు ఏమీ ఆశించకుండా పని చేస్తారు. క్రమశిక్షణారాహిత్యంతో నాకు తలపోట్లు తీసుకురాకండి. జనం కోసం నా రక్తాన్ని, కుటుంబాన్ని కూడా పక్కనబెట్టేస్తాను. నా సొంత బిడ్డలను కూడా పక్కనబెట్టగలను. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేనంత నిస్వార్థంగా ఉంటాను’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
‘‘నన్ను తిడితే భయపడతాను.. మేం లేకపోతే ఎన్నికల్లో గెలవం అనుకునే వాళ్లకు.. నేను దెబ్బతినటానికి సిద్ధంగా ఉంటాను తప్పితే.. కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేను. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ కుటుంబీకులు మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్తులో వాళ్లే మా వారసులు చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను కూడా నా పిల్లలను ప్రమోట్ చేస్తుంటే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది. మీ బిడ్డలు రాజకీయాల్లోకి వస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. అది సహజ క్రమంలో జరగనీయండి. దయచేసి మీ వాళ్లను ప్రజల మీద రుద్దకండి’’ అని పార్టీ నాయకులకు జనసేనాని హితవు పలికారు. ఎన్నికల్లో ఘన విజయం కూటమి విజయమన్న పవన్.. జనసేన విజయం మాత్రమే కాదన్నారు. టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించారు.