2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. చాలా మంది నాయకులు ఘోరంగా ఓడిపోయారు. ఇక ఫలితాల తర్వాత ఒకరిద్దరు నేతలు రాజకీయాల్లో కనపడుతున్నా.. చాలా మంది సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు వేరే పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అదంతా ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. అలాగే తాను ఒంగోలులో లేనంటూ ప్రచారం జరుగుతోందన్న బాలినేని.. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఒంగోలులోనే ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే ప్రజల తరుఫున పోరాటం చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిపైనా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తారనే వార్తలపైన బాలినేని స్పందించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కొదువ లేదన్న బాలినేని.. జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకుంటే స్థానిక నేతలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావు.. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద 34 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని రాజకీయంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారంటూ వార్తలు వచ్చాయి. తనకు ఉన్న సినీ పరిచయాల ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పుపై మాజీ మంత్రి బాలినేని క్లారిటీ ఇచ్చారు.