ఏపీ మంత్రివర్గం రేపు (మంగళవారం) రెండోసారి భేటీ కానుంది. రేపు ఉదయం (జులై 16) సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు అమోదంపై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది, ఈ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో పాటుగా జనసేన హామీలను కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో.. మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నైపుణ్య గణన వంటి హామీలపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే మంత్రివర్గ భేటీలో వేరే ఇతర హామీలపై దృష్టిపెడతారా అనే ఆసక్తి మొదలైంది.
ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15000 వంటి హామీలు ఇచ్చారు. రేపు జరిగే భేటీలో వీటిలో కొన్ని హామీల అమలుపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ, తల్లికి వందనం అమలుపై చర్చించనున్నట్లు సమాచారం. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తల్లికి వందనం హామీ అమలు గురించి ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
నెలరోజుల్లోగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అప్పట్లో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు చేయడంపైనా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. పొరుగు రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.