ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన ప్రజాప్రతినిధుల సత్కారం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌లతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఆ తర్వాత జనసేన నేతలు పవన్ కళ్యాణ్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందన్న పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా ఫోటో దిగాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని మోదీ సూచించారన్న పవన్.. తాను రాష్ట్రంలోనే ఉంటానని ప్రధానితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.
ఇక ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్... దేశంలోనే ఇదో కేస్ స్టడీ అని అభివర్ణించారు. ముంబైలో పెళ్లికి వెళ్తే అక్కడ కూడా జనసేన విజయం గురించే మాట్లాడుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం అవుతానని తాను ఊహించలేదని పవన్ కళ్యాణ్ జనసేన నేతల వద్ద అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల గురించి కూడా పవన్ ప్రస్తావించారు. కష్టపడిన వారికి పదవులు దక్కుతాయన్న పవన్ కళ్యాణ్.. అందరూ ఛైర్మన్ పదవుల మీదే ఆశపెట్టుకోవద్దని సూచించారు. ఇక జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలతో ఉండాలన్న పవన్ కళ్యాణ్.. ఎంపీలు పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు.
అలాగే అధికారంలోకి వచ్చామనే అహంకారం తగదన్న పవన్ కళ్యాణ్.. ఎంత సాధించినా తగ్గిఉండటం అవసరమని సలహా ఇచ్చారు. వైసీపీ కేవలం ప్రత్యర్థి పార్టీనే అని చెప్పిన పవన్.. శత్రువులు కాదని అన్నారు. గతంలో వైసీపీ చేసిన తప్పులను మనం చేయకూడదని జనసేన నేతలకు సూచించారు. టీడీపీ, బీజేపీ నేతల గురించి కూడా విమర్శలు చేయవద్దన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. అందరం చంద్రబాబుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక ఇప్పటి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానేమీ అడగలేదన్న పవన్.. రాష్ట్రం కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని, రైల్వేజోన్ కావాలని అడుగుతానని చెప్పారు.