తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చంద్రబాబు సర్కార్ సాయం కోరారు. తనను కాపాడాలంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రిక్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరిపై అక్రమంగా కేసులు పెట్టారని.. వాటి నుంచి విముక్తి కల్పించనున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పరిపాలనాధికారులు తనపై పెట్టిన అక్రమ కేసులతో తాను కోర్టుల చుట్టూ ఐదేళ్లుగా తిరగాల్సి వస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు రమణ దీక్షితులు. గత ప్రభుత్వ హయాంలో తనపై పెట్టిన కేసుల నుంచి నూతన ప్రభుత్వం ఉపశమనం కల్పించి, శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు. రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో రమణ దీక్షితులు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. టీటీడీతో పాటుగా, మాజీ ఈవో ధర్మారెడ్డి, తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై రమణ దీక్షితులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ధర్మారెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ వీడియోలతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తనది అలా మాట్లాడే స్వభావం కాదని..తాను చేయని దానికి బాధితుడ్ని చేస్తే తానేం చేయలేనని వ్యాఖ్యానించారు.
ఆ వెంటనే పరిణామాలు వేగంగా మారాయి.. రమణ దీక్షితులుపై తిరుమలలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం తిరుమల శ్రీవారి గౌరవ ప్రధానార్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును టీటీడీ పాలకమండలి ఫిబ్రవరిలో తొలగించింది. రమణ దీక్షితులు టీటీడీ అధికారులు, పాలకమండలి, జీయంగార్లు, అర్చుకులై చేసిన ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని.. అందుకే తొలగిస్తున్నట్లు తీర్మానం చేసి ఆమోదించారు.
ఈ కేసుపై రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు.. విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. రమణ దీక్షితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత రమణ దీక్షితులపై నమోదైన కేసులో వాయిస్ శాంంపిల్ ఇవ్వాలని తిరుపతి కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో రమణ దీక్షితుల గొంతును గుర్తించేందుకు వీలుగా ఆయన నుంచి వాయిస్ శాంపిల్‌ను పరీక్షకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని రమణ దీక్షితులను ఆదేశించింది.
ఆ వెంటనే రమణ దీక్షితులు ఈ ఉత్తర్వుల్ని హైకోర్టులో సవాల్ చేశారు.. పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం వాయిస్ శాంపిల్‌కు పంపే అధికారం తిరుపతి కోర్టు మెజిస్ట్రేట్‌కు లేదని లాయర్ వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులు పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు. తిరుపతి కోర్ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇవ్వాలన్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాలను అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఈ వాదనలు విన్ని హైకోర్టు తిరుపతి కోర్టు ఆదేశాలను ఇటీవల నిలుపుదల చేసింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది.