జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు అధిష్టానం శుభవార్త చెప్పింది. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం ప్రారంభమవుతుందని తెలిపారు. జులై 18 నుంచి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నేత, జనసైనికుడు, వీర మహిళ భాద్యతగా పాల్గొనాలని, కొత్త సభ్యత్వ నమోదు తో పాటు, సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ తెలిపింది.
'మన కోసం నిలబడే వారికి అండగా నిలబడే "జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం" ఈ జులై 18 నుంచి 28 వరకు జరుగుతోంది..ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ప్రమాద జీవిత బీమా.. రూ.50వేల వరకు ప్రమాద బీమా సదుపాయం' కల్పిస్తున్నామని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు అధిష్టానం సూచించింది.
'మన జనసేన పార్టీ కోసం నిలబడే వారికి అండగా నిలబడే ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన, ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఈనెల జులై 18 నుంచి ప్రారంభం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమం 11రోజుల పాటు అంటే 28 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళ భాద్యతగా పాల్గొని, కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా చూద్దాం' అన్నారు ఆ పార్టీ నేతలు.
'క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా ఉండదలచుకున్న వారు మీ నియోజక వర్గ ఇంచార్జీలను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న వాళ్ళను, లేదా మీకు తెలిసిన జనసేన నాయకులను తక్షణమే సంప్రదించండి.. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో మన వంతు పాత్ర మనం పోషిద్దాం' అని పిలుపునిచ్చారు.
ఈ మేరకు పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమిష్టి కృషితో సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఫలితాలు సాధించి జాతీయస్థాయిలో చర్చింకునే స్థాయిలో ఘన విజయం సాధించామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లగలిగామన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లకు సభ్యత్వ నమోదు లాగిన్ ఐడి ఇవ్వనున్నామని తెలియజేశారు.