విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఓ కుటుంబం విలువైన కానుకను అందజేశారు. గుంటూరుకు చెందిన ఎస్.హనుమాన్, ఎస్‌వీఆర్‌ఎల్ జ్యోతి, కుటుంబ సభ్యులు 71 గ్రాముల లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. దుర్గమ్మ అలంకరణ నిమిత్తం ఈ లక్ష్మీ కాసుల హారాన్ని అందించగా.. దీని విలువ రూ.5 లక్షల వరకు ఉంటుంది. హనుమాన్ కుటుంబం దుర్గమ్మ ఆలయ ఈవో రామారావును కలిసి హారాన్ని అందజేశారు.. వీరికి అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.
మరోవైపు విజయవాడ దుర్గమ్మకు.. హైదరాబాద్‌కు చెందిన భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఈ ఏడాదితో 15 ఈ బంగారు బోనం ఉత్సవాలు ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ కమిటీ సభ్యులకు దుర్గమ్మ ఆలయం ఆధ్వర్యంలో బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి దగ్గర ఈవో రామారావు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఊరేగింపులో వెయ్యిమంది కళాకారులు, శివశక్తులు, పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఊరేగింపు బ్రాహ్మణవీధి మీదుగా సాగగా.. దుర్గాఘాట్ దగ్గర కృష్ణానదిలో గంగ తెప్పకు పూజచేశారు. ఆ తర్వాత ఊరేగింపు కొండపైకి చేరుకోగా.. ఈ ఏడాది పాడిపంటలు పుష్కలంగా పండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.. అమ్మవారికి బోనం సమర్పించారు.
ఇటు ఆదివానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. దుర్గమ్మను ఏకంగా 52 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా.. 4350 మందికి పైగా భక్తులు ఆషాఢ సారెలు సమర్పించారు. ఆదివారం, అష్టమి తిథి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. వర్షం కురుస్తున్నప్పటికీ క్యూ లైన్లలో భారీగా భక్తులు కనిపించారు. ఇంద్రకీలాద్రిపై ధర్మపథం వేదికపై హైదరాబాద్‌కు చెందిన వారాహి డ్యాన్స్ అకాడమీ శంకరమంచి ఆదిలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తుల్ని ఆకట్టుకుంది.ఈనెల 6 నుంచి దుర్గగుడిలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రులు నేటితో ముగుస్తాయి. ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అలాగే దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఒక్క రోజులోనే భారీగా ఆదాయం సమకూరింది. ఆలయానికి సాయంత్రం 7 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. రూ.500 దర్శనం టికెట్ల టికెట్ల ద్వారా రూ.15లక్షల 31వేల 500.. రూ.300 టికెట్లద్వారా రూ.4లక్షల 79వేల 100, రూ.100 టికెట్ల ద్వారా రూ.6 లక్షల 5వేల 300 ఆదాయం వచ్చింది. అంతేకాదు విరాళాల ద్వారా రూ.9,32,753 ఆదాయం సమకూరింది. కేశఖండన శాలలో 2611 మంది తల నీలాలు సమర్పించనట్లు తెలిపారు.