తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొచ్చారు. తిరుపతి నుంచి తిరుమలతో పాటుగా ఇతర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే తిరుపతి నుంచి తిరుమలకు సర్వీసులు కొనసాగుతుండగా.. ఇకపై మధ్య పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తొలి విడతగా ఈ బస్సులు రాగా.. అందులో 62 బస్సులు తిరుమల-తిరుపతి, తిరుపతి నుంచి రేణిగుంట, తిరుపతి నుంచి కడప, మదనపల్లె, నెల్లూరు, శ్రీకాళహస్తిలకు నడుస్తున్నాయి. ఈ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు అలిపిరి డిపో, సీబీఎస్‌లో ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల - తిరుపతి మధ్య సుమారు 250 బస్సులు నడపాలని భావిస్తున్నారు. బస్సుల సంఖ్య పెరిగితే ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్‌లు అవసరం ఉంటుంది. అందుకే వంద బస్సులకు ఒకేసారి ఛార్జింగ్ చేసుకునేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్‌ను తిరుమలలో ప్రస్తుతం ఉన్న బస్టాండు, గ్యారేజీలో ఏర్పాటుకు వీలుపడుతుందని నిపుణుల ద్వారా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే టీటీడీని సంప్రదించి స్థలం కేటాయించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. కొండపై పలు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు.. బాలాజీనగర్‌కు వెళ్లేమార్గంలో గ్యాస్ గోడౌన్ దగ్గర నాలుగు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
తిరుమలకు వచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏడాదిన్నరగా వాయిదా పడుతున్న ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చారు. ఆయనే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ బాధ్యతల్లో కూడా ఉన్నారు. ఆయన బాలాజీనగర్ దగ్గర ఉన్న స్థలాన్ని డీజీపీ పరిశీలించారు.. చార్జింగ్ స్టేషన్‌కు అనుకూల, ప్రతికూల అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ స్థలం ఎంపికపై తిరుమలరావు సానుకూలంగా స్పందించారు.. వెంటనే ఆర్టీసీ తరఫున టీటీడీకి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో డీజీపీ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.