కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులు.. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా కూడా శ్రీవారి అన్నప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే గత కొంత కాలంగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నప్రసాదంలో నాణ్యత తగ్గిందని భక్తుల నుంచి టీటీడీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ నూతన ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామలరావు శ్రీవారి అన్నప్రసాదం నాణ్యతపై దృష్టి సారించారు.
తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించే దిశగా టీటీడీ ఈవో శ్యామలరావు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవలే పాకశాస్త్ర నిపుణులు, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చెఫ్‌లతో కమిటీని ఏర్పాటు చేసిన టీటీడీ ఈవో.. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు. తాజాగా టీటీడీ ఈవో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యతను పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారం తీసుకోవాలని టీటీడీ ఈవో నిర్ణయించారు.
సోమవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో ఈ అంశం గురించి టీటీడీ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న పదార్థాలు, ముడిసరుకుల నాణ్యతను పరిశీలించేందుకు తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో నిర్ణయించారు. ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ద్వారా ముడిసరుకు నాణ్యతను తెలుసుకోవటంతో పాటుగా తక్కువ ధరకు ఉత్తమ సరుకును సేకరించుకోవచ్చని శ్యామలరావు తెలిపారు.
శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి కావాల్సిన ముడిసరుకు సేకరణ కోసం టెండర్లను పిలిచే సమయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నియమాలు, నిబంధనలను పాటించాలని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియకు కూడా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.