రాష్ట్రంలో కూటమి పాలన 35 రోజులు పూర్తయ్యింది, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. నాలుగు అసత్యాలు.. పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రాలు ఉన్నాయని, నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైయస్ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.... ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని, ఆ పని చేస్తే.. రాష్ట్ర అప్పులపై తమ విష ప్రచారం నిగ్గు తేలుతుందన్న భయం ప్రభుత్వంలో నెలకొందని.. అందుకే ఆ దిశలో ఆలోచించడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆనాడు 2019లో తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయని, అయినప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడిన తరవాత ఆ ఏడాది జూలై 12న అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎన్నికల ముందు లెక్కకు మించి హామీలు గుప్పించిన చంద్రబాబు, అందుకు నిధుల గురించి ప్రస్తావిస్తే.. సంపద సృష్టిస్తామంటూ ప్రగల్భాలు పలికారని.. కానీ, ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రజలందరికీ చెప్పాలని ఆయన సూచిస్తున్నారన్న శ్రీ పేర్ని నాని.. ఇది పచ్చి మోసం కాదా? అని నిలదీశారు.