వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు , కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ మరియు ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయన్నారు. నీతి అయోగ్ డ్రాఫ్ట్ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. ప్రజల, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆహ్వానిస్తున్నాన్నారు. వైసీపీ పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారని.. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చుక్కల భూములు 22ఏ క్రింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారం సత్వరం అవసరమన్నారు. చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు చాల ఎక్కువ ఉందని తెలిపారు. గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలది ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారన్నారు. సింహాచలం దేవాలయ గెస్ట్ హౌస్‌లో తమిళనాడు నుంచి వచ్చిన కార్తీక్ సుందర రాజన్ అనే వ్యక్తి దేవాలయల భూముల రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయన్నారు. తిరుపతిలోని హాదిరాం మఠం భూములు గందరగోళం అయ్యాయని బీజేపీ నేత వెల్లడించారు.