రషీద్ హత్యకు సూత్రధారులు, కుట్రదారులను పోలీసులు గుర్తించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయన్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాకాణి ధ్వజమెత్తారు. శనివారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... పల్నాడు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేతల దాడులు తీవ్రతరం అవుతున్నాయి. నడ్డిరోడ్డుపై రషీద్‌ను దారుణంగా హతమార్చారు. వ్యక్తిగత వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి వ్యక్తికి ఏపీలో పనిచేసే అర్హత కూడా లేదు. రషీద్ హత్యపై ఎస్పీ తీరు సరికాదు. రషీద్‌ను హత్య చేసిన వ్యక్తి పేరు జిలానీ. అతను టీడీపీకి చెందిన కార్యకర్త. రషీద్ హత్యకు సూత్రధారులు, కుట్రదారులను పోలీసులు గుర్తించాలి. రేపు రషీద్ కుటుంబ సభ్యులను వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మాజీ లోక్‌సభ సభ్యుడు రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో పోలీసులు వీడియోగ్రాఫర్ల పాత్ర పోషించారు తప్ప రక్షణ ఇవ్వలేదు. చివరకు మిథున్ రెడ్డి గన్‌మెన్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు మరింత పెరిగాయి. మూడు వేల కుటుంబాలు గ్రామాలు వదిలి వలస వెళ్లారు. రాష్ట్రంలో మహిళలు, మైనర్లపై అఘాయిత్యాలు కూడా అధికమయ్యాయి. ముచ్చుమర్రిలో బాలిక శవం కూడా దొరకడం లేదు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత మాటలు చూసి ఎంతో మురిసిపోయాం. కానీ, ఆమె ఇప్పుడు ఎక్కడుందో కనపడటం లేదు. వైయస్ఆర్‌సీపీ నేతల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే భయపడేలా చేస్తామన్న పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వైయస్ఆర్‌సీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించరు.. ఎవరు ఇవ్వలేని పాలనను ఇస్తామని కూటమి నేతలు చెబితే మంచి పాలన ఇస్తారేమో అనుకున్నాం. ఇదేనా వాళ్ళు చేస్తున్న పాలన అని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa