నెల్లూరులో రొట్టెల పండుగను సందడిగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. దీనికి 20 లక్షల మంది వరకూ వస్తారని అంచనాగా ఉంది. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బారాషహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదని అన్నారు. భక్తులు నమ్మకం మరింత గొప్పదన్నారు. బారా షాహీ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. ‘‘ రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం భాగంగా రొట్టెల పండుగ గొప్పదని పేర్కొన్నారు. కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి ఇవ్వడం నమ్మకం’’ అని పేర్కొన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుడిని ప్రార్ధించి చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరికి నమ్మకమైన దేవుడిని, వారు ప్రార్ధించాలని సీఎం పేర్కొన్నారు. కోర్కెలు కోరుకుని, మళ్లీ వచ్చే ఏడాది వచ్చి మొక్కులు తీర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. 20 లక్షల మంది భక్తులు రొట్టెలు పండుగకు వస్తున్నారన్నారు. రూ.5 కోట్లు నిధులు కేటాయించామని.. రొట్టెల పండుగకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని... సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని.. ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాలని చంద్రబాబు సూచించారు.