వైఎస్ జగన్ వినుకొండ పర్యటన సందర్భంగా ఆయనకు ఫిట్‌నెస్ లేని వాహనం కేటాయించారని.. వైసీపీ అధినేతకు భద్రత కూడా తగ్గించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్‌కు తుప్పుపట్టిన వాహనాన్ని ఇచ్చారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఆరోపించారు. ఇదిలా ఉంటే వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ జగన్.. ప్రభుత్వం కేటాయించిన కారుకు పదే పదే ఆగిపోతోందంటూ.. సొంత వాహనంలో బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, శ్రేణులు ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ భద్రత, కాన్వాయిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. కండీషన్‌లో లేని వాహనాన్ని ఇచ్చారన్న వైసీపీ ప్రచారాన్ని ఖండించింది. అలాగే వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.
ఇక వైఎస్ జగన్‌కు కేటాయించిన వాహనం ఫిట్‌నెస్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వ అధికారులు తప్పుబట్టారు. వైఎస్ జగన్‌కు కేటాయించిన వాహనాన్ని ముందు పరిశీలించిన తర్వాతే కేటాయించామని.. అధికారులు స్పష్టం చేశారు. సౌకర్యంగా లేదని కారు దిగిపోయిన వైఎస్ జగన్.. వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదని అన్నారు. వైఎస్ జగన్ కారు దిగిన తర్వాత కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనం అదే వైఎస్ జగన్ కాన్వాయి వెంబడి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అలాగే వైఎస్ జగన్ కాన్వాయి వెంట వచ్చిన వాహనాలను నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా అధికారులు తోసిపుచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.
ఎస్ఆర్‌సీ 2024 సి నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రులకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పి్స్తారన్న అధికారులు.. దాని ప్రకారమే వైఎస్ జగన్‌కు భద్రత కల్పించినట్లు తెలిపారు. అయితే అదనపు ఆక్టోపస్, ఎపిఎస్పి బలగాల నుంచి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతకు పరిమితం చేసినట్లు ప్రకటనతో తెలిపారు. Z+ కేటగిరీ ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారి బీఅర్ కార్ కేటాయించినట్లు వెల్లడించారు. అయితే విజయవాడలో టాటా సఫారి బీఆర్ కార్లు లేవన్న అధికారులు.. విజయనగరం పూల్‌లో లభ్యమైన బీఆర్ కార్‌ను కేటాయించినట్లు తెలిపారు. ఈ కారు 2018 మోడల్‌కు చెందినదిగా.. అందుబాటులో ఉన్న టాటా సఫారి బీఅర్ కార్లలో ఉత్తమమైందిగా అధికారులు ప్రకటనలో తెలిపారు.
ఇక వైఎస్ జగన్‌కు కేటాయించిన ఈ కారును డ్రైవర్.. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు విజయనగరంలో బయల్దేరి.. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు తాడేపల్లికి తీసుకువచ్చినట్లు అధికారులు చెప్పారు. విజయనగరం నుంచి తాడేపల్లి వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించిందని ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లిలో ఉదయం పది గంటలకు వైఎస్ జగన్ ఈ కారులో బయల్దేరారన్న ప్రభుత్వం.. ప్రయాణం మొదలెట్టిన 10 నిమిషాలకే వైఎస్ జగన్ తన స్వంత టయోటా ఫార్చునర్ కారులోకి మారినట్లు తెలిపింది. కారు కండీషన్‌లోనే ఉందని.. ఎలాంటి బ్రేక్ డౌన్ కాలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కేటాయించిన కారులో కంఫర్ట్ లేదనే కారణంతోనే వైఎస్ జగన్ కారు మారినట్లు స్పష్టం చేసింది.